- నిల్వ చేయకూడని తేల్చి చెప్పిన ఎన్‌డీఎస్‌ఏ..
- ఎన్‌డీఎస్‌ఏ నిపుణులతో మంత్రి ఉత్తమ్ భేటీ
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ నీరు నిల్వ చేయకూడదని, అది ఏమాత్రం సేఫ్ కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) తేల్చి చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయా బ్యారేజీలకు చేసింది తాత్కాలిక రిపేర్లేనని, అలాంటప్పుడు నీటిని ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. మంత్రి ఉత్తమ్, ఈఎన్‌సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరామ్.. ఎన్‌డీఎస్‌ఏ అధికారులతో శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి, రిపేర్లు చేయడానికి ఏం చేయాలో చెప్పాలని ఎన్‌డీఎస్‌ఏని వారు కోరినట్టు తెలిసింది. డ్యామేజీపై తుది నివేదికను కూడా త్వరగా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రిపోర్ట్ ఇప్పటికే ఆలస్యమైందని, రిపోర్ట్ ఇస్తే దాని ఆధారంగా బ్యారేజీకి మరమ్మతులు చేసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. కాగా, ఇప్పటికిప్పుడు నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని, డిసెంబర్‌లో సమగ్ర నివేదిక ఇస్తామని ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జుడీషియల్ కమిషన్ విచారణ జరుపుతున్నదని, రిపోర్ట్ ఇస్తేనే విచారణ ముందుకు సాగుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పినట్లు తెలిసింది. బ్యారేజీకి సంబంధించి పలు జియో టెక్నికల్ టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉందని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొన్నట్టు సమాచారం. డిసెంబర్ నాటికి తుది నివేదికని ఇస్తామని, అప్పటి వరకు బ్యారేజీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్టు సమాచారం. స్టేటస్ కోను మెయింటెయిన్ చేయాలని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసినట్టు తెలిసింది.